స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ కార్తీకదీపం ముగిసాక మొదలైంది. షారుక్ ఖాన్ ఈ సీరియల్ ని ప్రమోట్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పటిదాకా జరిగిన ఎపిసోడ్ లలో ఒక మిడిల్ క్లాస్, డబ్బున్న వాళ్ళకి ఉన్న వ్యత్యాసాలు చూపించాడు డైరెక్టర్. ఇక హీరో రాజ్ పాత్రని, హీరోయిన్ కావ్య పాత్రలని ఇద్దరు వేరు వేరు అభిరుచులు గలవారిలా భిన్నాభిప్రాయాలతో పరిచయం చేశాడు డైరెక్టర్.
ఇక హీరోయిన్ కావ్య అమ్మ పాత్రలో కనకంని ఎలివేట్ చేసిన తీరు ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉండే మహిళలను ప్రతిబింబించేలా మలిచాడు. తనలా తన కూతుళ్ళు కష్టపడకూడదని, గొప్పింటికి కోడళ్ళని చేయాలనే ఆశపడే పాత్రలో ఇమిడిపోయింది కనకం. కావ్య తండ్రి మాత్రం నీతిగా నిజాయితీగా ఉండాలి అని, ఉన్నదాంట్లో సర్దుకొనిపోదాం అన్నట్టుగా ఉంటాడు. కావ్య చెల్లి చదువుకునే స్తోమత లేక పిజ్జా డెలివరీలో జాయిన్ అయ్యి టామ్ గర్ల్ గా తయారవుతుంది. అలాగే కావ్య అక్క స్వప్న గ్లామర్, మేకప్ అంటూ తన అందాన్ని కాపాడుకోవాలని, గొప్పింటికి వెళ్ళాలని పెళ్ళి గురించి కలలు కంటుంది.
హీరో రాజ్ ఒక ధనవంతుడిలా, గర్వం కలిగినవాడిలా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు. ఒకతను కవితలు వ్రాస్తూ, మరొకతను రాజ్ ఏది కోరుకుంటే అతడికంటే ముందు తను సొంతం చేసుకోవాలనుకుంటాడు. వీళ్ళకి గాఢ్ ఫాదర్ లా తాతయ్య సీతారామయ్య.. ఆయన మాట మీదే అందరూ ఉండటం బాగుంది. డైరెక్టర్ ప్రతీ క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. 'కార్తీకదీపం' సీరియల్ ఎలాగైతే బజ్ క్రియేట్ చేసిందో అలాగే ఈ సీరియల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సీరియల్ ప్రస్తుతం అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతోంది.